*ఏదో ఒకటి చెప్పు..”Say something”..
*నువ్వు నేను మాట్లాడుకోని రోజు వస్తే.. ఏమవుతుంది…?
ఏదేమైనా జాలువారుతూనే ఉంటుందిగా అనంత నిశ్శబ్ద ప్రణయగీతం..!!
ఔను వాళ్ళిద్దరు ప్రేమికులు.ఒకరిని విడిచి మరొకరు వుండలేరు..అలాంటిది
వారిద్దరి మధ్య గ్యాప్ వస్తే?ఇద్దరూ ఎడమొహం పెడమొహమైతే? ఇద్దరూ
మాట్లాడుకోని రోజు వస్తే.. ఏమవుతుంది ? ఆ వైనమేందో తెలుసుకునే ముందు
రమాదేవి ‘ మార్క్’ ప్రేమ కవితను మీరూ చదవండి !!
*నువ్వు నేను …….
మాట్లాడుకోని రోజు వస్తే..
ఏమవుతుంది…?
ఏమవుతుంది ....????????
నువ్వు నన్ను మాటలేమి అనవు
నేను నిన్ను అసలు ఏమీ అనలేను...
ఎదురుపడితే
తప్పుకుపోవాలని నువ్వు అనుకోవు
తప్పించుకపోవాలని నేను అనుకోను
ఓ పొదుపైన బిగువు గీత
ఆ వైపు నీవు .. ఈ వైపు నేను
లేదంటే ఒకే వైపు దూరదూరంగా
తెలియని లెక్కలా
తెలపలేని లెక్కలా....
ఏదేమైనా....
జాలువారుతూనే ఉంటుందిగా
అనంత నిశ్శబ్ద ప్రణయగీతం
అంతుచిక్కని అంతర్వాహినిలా
ఓయ్... ఏమంటావ్..?
*Say something”..
*ఆర్. రమాదేవి.!!
ప్రేమికులమధ్య దూరంపెరిగి,ఇద్దరు ఎదురెదురైనా
మాట్లాడుకోలేని పరిస్థితి నెలకొంటేఎలావుంటుంది.
ఆ ఇద్దరూ మాట్లాడుకోని రోజు వస్తే ఏమవుతుంది?
ఓ సారి ఊహించుకోండి.
అతగాడామెను మాటలేమి అనడు.అసలామె ముందు నోరు విప్పడు.కనీసం ఎలా వున్నావని
కూడా అడగడు.ఇక ఆమైతే…అతగాడ్ని ఏమీ అనలేదు…ఒకరికొకరు ఎదురుపడితే తప్పుకుపోవాలని
అతగాడు అనుకోడు.తప్పించుకపోవాలని ఆమె కూడా అనుకోదు..నిన్నమొన్నటిదాకా ఒకే గొంతు
తో ప్రేమగీతాలు పాడుకున్న ఆ రెండు హృదయాలు ఎలా తప్పుకుపోవాలనుకుంటారు.అసలు….
తప్పించుకుపోవాలనే స్పృహ ఎలా కలుగుతుంది? కాకుంటే…ఇద్దరి మధ్య ఓ పొదుపైన బిగువు గీత
ఊడిపడింది.ఆ వైపు అతడు..ఈ వైపు ఆమె….చెరోవైపు ఇద్దరు.లేదంటే ఒకే వైపు ఇద్దరూ దూర
దూరంగా..అవును వాళ్ళ పరిస్థితి ఇంకాతెలియని లెక్కలా..బయటకు తెలపలేని లెక్కలా తయారైంది.
ఏదేమైనా....
వాళ్ళిద్దరు ఎడమొహం,పెడమొహమైనా, ఇద్దరి మధ్య విభజన గీత నెలకొన్నా…వాళ్ళు ప్రేమికులే.
వారిమధ్య అనంత నిశ్శబ్ద ప్రణయగీతం అంతుచిక్కని అంతర్వాహినిలా జాలువారుతూనే …..
ఉంటుంది…!
వారిది ‘ ప్రేమ’ కులం..వారు ప్రేమికులు….
ఎన్ని ఒడుదుడుకులొచ్చినా,అవాంతరాలు వచ్చినా,వారిలో ఇంకిన ప్రేమ ‘చెమ్మ’ ఎన్నడూ
ఎండిపోదు..ఇంకాచెప్పాలంటే,అది నిరంతరం ‘తడి’ గానే..వుంటుంది…!!
*ఎ.రజాహుస్సేన్..!!